ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తికి కీలక బాధ్యతలు!
భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికా చట్టసభ్యులు ప్రమీలా జయపాల్ (55), రాజా కృష్ణమూర్తి (47) బడ్జెట్‌తో పాటు కొవిడ్-19 మహమ్మారిపై ఏర్పాటైన రెండు కీలక కాంగ్రెస్ కమిటీలకు నామినేట్ అయ్యారు. వారి పేర్లను కాంగ్రెస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సిఫారసు చేశారు. శక్తివంతమైన బడ్జెట్ కమిటీకి ప్రమీలా జయపాల్‌ను, కరోనా వైరస్ సంక్షోభంపై ఏర్పాటైన మరో కీలక కమిటీకి రాజా కృష్ణమూర్తిని పెలోసి నామినేట్ చేశారు. కాగా, తమకు దక్కిన ఈ గౌరవానికి వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.
కరోనా కమిటీ చైర్మన్ క్లైబర్న్తో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. కొవిడ్‌ను జయించి అమెరికన్ల ఆరోగ్యం, గోపత్యను కాపాడుతాం. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తాం అని కృష్ణమూర్తి చెప్పారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ జయపాల్. కనీసం వేతనం గంటకు 15 డాలర్లు అనే అంశానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జయపాల్ కీలక బడ్జెట్ కమిటీకి ఎన్నికయ్యారు.






