కాలిఫోర్నియా సెనేటర్ గా భారతీయ అమెరికన్
భారతీయ అమెరికన్ రోఖన్నా కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యే అవకాశమున్నట్టు భావిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా రోఖన్నా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రతినిధుల్లో ఒకరిని సెనేటర్‌గా నామినేట్ చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసన్కు ఉన్నది. 2016లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికైన కమలాహారిస్ ఉపాధ్యక్షురాలిగా వచ్చే జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంకా ఆమెకు రెండేళ్ల పదవీ కాలం ఉండగా సెనేటర్ పదవికి ఖాళీ ఏర్పడుతోంది. దాంతో, మరో రెండేళ్ల కాలానికి సెనేటర్‌ను గవర్నర్ నామినేట్ చేస్తారు. సెనేటర్ పదవికి రోఖన్నాకు పోటీగా ఉండేవారిలో కాలిఫోర్నియా రాష్ట్ర సెక్రటరీ అలెక్స్ పడిల్లా (లాటిన్ అమెరికన్), కాంగ్రెస్ సభ్యులురాలు కరెన్బాస్ (డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడిన వ్యక్తి), కాంగ్రెస్ సభ్యురాలు బార్బరా లీ, తదితరులు ఉన్నారు. రోఖన్నాను సెనేటర్‌గా నియమించడం ఎంతో సముచితమని భారత అమెరికన్ యాక్షన్ కమిటీ ఇంపాక్ట్ తరపున ఇప్పటికే గవర్నర్‌కు సిఫారసు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అవసరమని, అందుకు తగిన అర్హతలు రోఖన్నాకు ఉన్నాయని ఇంపాక్ట్ పేర్కొన్నది.






