బైడెన్ టీమ్ లో …ప్రమీలా జయపాల్ కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవుల్లో భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా సీనియర్ నేత అయిన ప్రమీలా జయపాల్‌కు కూడా సముచిత స్థానం కల్పించారు. యాంటీట్రస్ట్, కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా సబ్‌కమిటీ ఉపాధ్యక్షురాలిగా ప్రమీలా జయపాల్‌ను నియమిస్తూ జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 55 ఏండ్ల ప్రమీలా జయపాల్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపీగా ఉన్నారు. తనకు ఈ పదవికి నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రమీలా జయపాల్.. తనకు జో బైడెన్ సముచిత స్థానం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు.
2020 డిసెంబరులో యూఎస్ పార్లమెంటు కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ (సీపీసీ) అధ్యక్షురాలిగా ప్రమీలా జయపాల్ ఎన్నికయ్యారు. ప్రమీలా జైపాల్ 1966 లో అప్పటి మద్రాసులో జన్మించారు. ఎక్కువ సమయం ఇండోనేషియా, సింగపూర్‌లో గడిపారు. తన 16 సంవత్సరాల వయసులో 1982లో అమెరికాకు వచ్చిన ప్రమీలా జయపాల్.. జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి కళాశాల విద్య పూర్తి చేశారు. అనంతరం నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. కొంతకాలం పాటు ఆర్థిక విశ్లేషకురాలిగా పనిచేసిన ప్రమీలా.. చికాగో, థాయ్‌లాండ్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులో కూడా పాల్గొన్నారు.
1991 లో ప్రభుత్వ రంగంలో చేరడానికి ముందు మార్కెటింగ్, వైద్య, అమ్మకాల రంగాల్లో పని చేశారు. అమెరికాలో 9/11 దాడుల తరువాత అమెరికాలో విదేశీ సంతతికి చెందిన పౌరుల సమూహాన్ని ఏర్పాటు చేయడానికి తన పూర్తి మద్దతు తెలిపారు. హేట్ ఫ్రీ జోన్‌ను స్థాపించి అమెరికాలో ఆసియా సంతతికి చెందిన ప్రజలకు విశేష సేవలందించారు. ఇమిగ్రేషన్ నియమాలను మరింత పాదర్శకంగా చేయడానికి, వాటిని సరళంగా చేయడానికి ప్రయత్నించారు. బుష్ పరిపాలనలో ఆమె దేశవ్యాప్తంగా 4000 మంది సోమాలియా ప్రజలను సురక్షితంగా తిరిగి పంపించడంలో కీలక పాత్ర పోషించారు.






