అభిశంసనకే భారతీయుల ఓటు!
ట్రంప్ చేసింది తప్పేనంటున్న భారతీయ అమెరికన్ సెనేటర్లు
వాషింగ్టన్ః జనవరి 6న తన మద్దతుదారులను హింసావిధ్వంసకాండలకు ప్రేరేపించినందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించాల్సిందేనని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ అభిశంసనపై సెనేట్‌లో విచారణ ప్రారంభమైన సందర్భంగా వారు ఈ రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. అభిశంసన తీర్మానానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.
‘‘ట్రంప్ రెచ్చగొట్టినందువల్లే జనం క్యాపిటల్ హిల్ మీదా, మన ప్రజాస్వామ్య సంస్థల మీదా దాడి చేశారనడంలో సందేహం లేదు. ఆ రోజున అమెరికన్ ప్రజా ప్రతినిధులు, సెనేటర్లు, వారి సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారంటే అందుకు ట్రంపే కారణం. ఆయనకు శిక్ష పడాల్సిందే’’ అని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణ మూర్తి వ్యాఖ్యానించారు.
‘‘అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో విచారణ జరుగుతున్నంత సేపూ నాకు జనవరి 6 నాటి సంఘటనలే పదే పదే గుర్తుకు రావడం ప్రారంభించాయి. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెను పిండేసినట్టుగా ఉంటుంది. ఆ రోజున క్యాపిటల్ హిల్ మీద విధ్వంస మూకలు దాడి చేసినప్పుడు నేను, నా సిబ్బంది నా ఆఫీసును వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. పైగా మా ఆఫీసుకు 200 అడుగుల దూరంలో బాంబు కనిపించడం నన్ను భయభ్రాంతుడిని చేసింది’’ అని కృష్ణ మూర్తి పేర్కొన్నారు.
అమెరికా ప్రతినిధుల మహాసభలో ట్రంప్ అభిశంసనకు మద్దతుగా కృష్ణ మూర్తి ఓటు వేశారు. అమి బేరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ అనే మరో ముగ్గురు భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా అభిశంసనకు మద్దతునిచ్చారు. ‘‘శిక్ష పడడానికే మా ఓటు’’ అని ప్రమీలా జయపాల్ వ్యాఖ్యానించారు.
‘‘అభిశంసన తీర్మానంపై విచారణ సందర్భంగా ప్రవేశపెట్టిన వీడియో సాక్ష్యాన్ని చూశాను. మద్దతుదార్లను ట్రంప్ రెచ్చగొడుతూ మాట్లాడడం, మద్దతుదారులంతా క్యాపిటల్ హిల్‌పై దాడి చేయడం వంటివి అందులో చూసినప్పుడు ఒళ్లు జలదరించింది. మేమంతా అక్కడే ఉన్నాం. మా మీదా, ప్రజాస్వామ్యం మీదా ట్రంప్ విధ్వంసక మూకలను రెచ్చగొట్టలేదని మేం ఎలా అనగలం?’’ అని ఆమె ఒక ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 6 నాటి సంఘటనలకు సంబంధించి ప్రాసిక్యూషన్ భావోద్వేగ కథనం విన్న తర్వాత తన వాదన తీరును మార్చుకున్నట్టు ట్రంప్ తరఫు న్యాయవాది బ్రూస్ కాస్టర్ తెలిపారు. సెనేటర్లతో వాదన మాదిరిగా కాకుండా ఒక సంభాషణ మాదిరిగా మాట్లాడడం ప్రారంభించానని ఆయన అన్నారు. ఈ దారుణమైన దాడిని, అల్లరి మూకలు హింసా విధ్వంసకాండకు పాల్పడడాన్ని ట్రంప్ బృందం ఖండిస్తుందని ఆశించానని కూడా ఆయన పేర్కొన్నారు.






