Donald Trump: అన్నంత పనీ చేసిన ట్రంప్… ఆ విశ్వవిద్యాలయానికి నిధులు నిలిపివేత

హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University )విషయంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం అన్నంత పనీ చేసింది. ఆ విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధుల (Federal funds)ను నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మన్ (Linda McMann) ప్రకటించారు. విశ్వవిద్యాలయంపై నియంత్రణ ఆశిస్తూ కొన్ని విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించినప్పటికీ, దానికి ససేమిరా అనడంతో వర్సిటీ బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకూ హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు.
ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు ఈ నిషేధం వర్తిస్తుందని, యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు (tuition fees)లను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ పేర్కొంది. కొత్త గ్రాంట్లకు అర్హత పొందడానికి హార్వర్డ్ ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని మెక్‌మాన్ తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌లో ప్రవేశం కల్పిస్తూ దేశ అత్యున్నత విద్యా వ్యవస్థను అపహాస్యం చేసిందని ఆరోపించారు. మరోవైపు విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.