జార్జియా రీకౌంటింగ్.. బైడెన్ దే విక్టరీ
అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. జార్జియాను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ రాష్ట్రంలో నిర్వహించిన రీకౌంట్‌లో ఆయనే విజేతగా తేలారు. దీంతో కీలకమైన 16 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ వశం అయ్యాయి. 1996 బిల్ క్లింటన్ తర్వాత ఈ రాష్ట్రాన్ని డెమోక్రటిక్ నేత సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. అయితే జార్జియా విక్టరీతో బైడెన్ 306-232 తేడాతో అద్యక్ష రేసులో ఆధిక్యం సాధించారు. ఎన్నికలు జరిగిన రెండు వారాల తర్వాత జార్జియా రాష్ట్రంలో మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారు. ఆ రీకౌంటింగ్‌లో బైడెన్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 12,284 ఓట్ల తేడాతో బైడెన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జార్జియాలో నిర్వహించిన పేపర్ బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థ కచ్చితంగా ఉందని ఓ రిపబ్లికన్ సేనేటర్ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా ఓటమిని అంగీకరించలేదు. అధికార బదలాయింపు పక్రియకు కూడా ట్రంప్ సహకరించడం లేదు.






