భారతీయ- అమెరికన్లకు కీలక పదవులు ..
అమెరికా ప్రభుత్వంలో మరికొంత మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. కీలకమైన ఇంధన శాఖలో నలుగురు భారతీయ అమెరికన్లను నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. తారిక్ షా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించనున్నారు. ఆఫీస్ సైన్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని తన్యా దాస్ చేపట్టనున్నారు. ఆఫీస్ ఆఫ్ జనరల్ కౌన్సిల్లో నారాయణ్ సుబ్రమణియన్ న్యాయ సలహాదారుగా వ్యవహరించనుండగా.. షుచి తపలి ఫాజిల్ ఎనర్జీ విభాగంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు వివిధ దేశాల మూలాలున్న 19 మందిని ఇంధన విభాగంలోని ఇతర పదవులకు ఎంపిక చేశారు.
శుద్ధ ఇంధన దిశగా అమెరికా వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో కీలక పదవులు భారతీయ అమెరికన్ల చేతికి చిక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పులు విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలన్న బైడెన్ లక్ష్య ఛేధనలో ఇంధన విభాగం ప్రధాన పాత్ర పోషించనుంది. తారక్ షా 2014-17 మధ్య సైన్స్ అండ్ ఎనర్జీ విభాగంలో అండర్ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. ఒబామా సెనేట్, అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు.






