Elon Musk: ఆఫీసులకు రాకుంటే లీవు తప్పదు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం నుంచి తప్పనిసరిగా తిరిగి విధులకు హాజరు కావాల్సిందేనని ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. హాజరు కాని వారందరినీ పరిపాలనా పరమైన లీవు (Leave)పై సాగనంపుతామని హెచ్చరించారు. వారికిక వేతనాలుండవన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వేగంగా జరుగుతున్న పరిణామాలతో ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో అయోమయం , ఉద్యోగుల్లో (Employees )ఆందోళన పెరిగిపోయాయి. యంత్రాంగాల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఉద్యోగులు ఎవరికి వారు తమ పనితీరును వివరించాలంటూ మస్క్ రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలపై స్పందించాలంటూ హెల్త్, హ్యూమన్ రిసోర్సెస్, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తమ ఉద్యోగులకు సూచించగా ఆ అవసరం లేదంటూ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీపై ఇంధన, వాణిజ్య విభాగాలు సూచించాయి. ఇప్పటికే కన్జూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (Consumer Financial Protection Bureau) ఉద్యోగులను మస్క్ యంత్రాంగం ఇళ్లకు పంపించేసింది.