వారికి చట్టబద్ధ నివాస హోదా ఆదేశాల నిలిపివేత : టెక్సాస్ కోర్టు తీర్పు
అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు చట్టబద్ద నివాస హోదా కల్పించేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలను టెక్సాస్ ఫెడరల్ జడ్జి నిలిపేశారు. అధ్యక్షుడి ఆదేశాలపై పరిపాలనాపరమైన స్టేను అమెరికా జిల్లా జడ్డి జె.క్యాంప్‌బెల్ బార్కర్ ఇచ్చారు. దీంతో 5,00,000 జీవిత భాగస్వాములకు 50,000 మంది పిల్లలకు ఇవ్వాలనుకున్న చట్టబద్ధ నివాస హోదా నిలిచిపోనుంది. వారి పౌరసత్వ దరఖాస్తుల స్వీకరణా ఆగిపోనుంది. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములై వారికి చట్టబద్ధ నివాస హోదా కల్పించేందుకు, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గత జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఆదేశాలను ( ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ చేశారు. బైడెన్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటి. అయితే ఈ ఆదేశాలను రిపబ్లికన్లు అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కోర్టులో సవాలు చేశారు. ఇప్పటికే అక్రమ వలసదారులతో కిక్కిరిసి ఉన్నామని టెక్సాస్ స్పష్టం చేసింది. దీంతో అధ్యక్షుడి ఆదేశాలను నిలిపేస్తూ జడ్జి తీర్పు చెప్పారు.






