9/11 రహస్య పత్రాలు విడుదల చేసిన అమెరికా
9/11 ఉగ్రదాడికి సంబంధించిన కొన్ని రహస్యపత్రాలను అమెరికా విడుదల చేసింది. ఇందులో సౌదీ ప్రభుత్వ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ దాడిలో నాలుగు విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 2,997 మంది మృతి చెందారు. ఈ దాడుల్లో విమానాలను హైజక్ చేసిన 19 మంది ఉగ్రవాదుల్లో 15 మంది సౌదీ జాతీయులు కావడం. ఆల్‌ఖైదా అధిపతి ఒసామాబిన్ లాడెన్ కూడా ఆ దేశానికి చెందిన వ్యక్తి కావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అమెరికాలోకి హైజాకర్లు ప్రవేశించడానికి సౌదీ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తుల బంధువులు కూడా రహస్య పత్రాలను విడుదల చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. పత్రాలను విడుదలకు అభ్యంతరం లేదని అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కూడా స్పష్టం చేసింది. దీంతో ఎఫ్‌బీఐ రహస్య పత్రాలను విడుదల చేసింది.






