ట్రంప్ కు షాకిచ్చిన ట్విట్టర్, ఫేస్బుక్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు షాకిచ్చాయి. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ట్రంప్ ఖాతాను ట్విట్టర్ 12 గంటల పాటు లాక్ చేసేసింది. ఇక ఫేస్బుక్ 24 గంటల పాటు బ్యాన్ చేసేసింది. అంతేకాకుండా ఈ ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ చేసిన పోస్ట్‌లను కూడా తొలగించేశాయి.
ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాట్లాడుతూ… ఈ ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ ఫేస్‌బుక్‌ను ఉపయోగించిన తీరును తప్పుబట్టారు. జో బైడెన్‌కు అధికార మార్పిడిని అణగదొక్కేందుకు ఉపయోగించే విధంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ట్రంప్ తన మద్దతుదారుల చర్యలను తప్పుబట్టే విధంగా కాకుండా వారి చర్యలను సమర్థించేలా ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. హింసను ప్రేరేపించే ఉద్దేశంతో చేసినట్లు ఉన్న ట్రంప్ వ్యాఖ్యలను తాము తొలగించినట్లు జుకన్ బర్గ్ తెలిపారు.
మరోవైపు వాషింగ్టన్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో నగర మేయర్ బౌజర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లో కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.






