పేద ప్రజలను ఆదుకుంటాం అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ హామీ
దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నడుం బిగించారు. లక్షలాది మందికి పౌష్టికాహారాన్ని అందించడం, బడుగు జీవుల ఉద్యోగాలను కాపాడడం ఒక ‘ఆర్థిక అవసరమని’ ఆయన స్పష్టం చేశారు.
వాషింగ్టన్ కరోనా ప్రభావం వల్ల పూట గడవడమే కష్టమైపోతున్న కుటుంబాలను ఆదుకోవడానికి, కొందరు బడుగు కార్మికుల ఉపాధిని కాపాడడానికి సంబంధించిన రెండు ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న సంతకాలు చేశారు. తన ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఆయన మరొకసారి తన కార్యనిర్వాహక అధికారాలను ప్రయోగించారు.
నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదకు ఎక్కించడానికి ప్రకటించిన ఉద్దీపన పథకం ఇంకా కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది.
”ఈ సంక్షోభం రాను రాను తీవ్రతరం అవుతోంది” అని ఆయన వైట్‌హౌస్ కార్యాలయంలో వ్యాఖ్యానించారు. ఉపాధులు కోల్పోయినవారికి, కడుపు నిండనివారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని, ఇది ‘ఆర్థికపరమైన అగత్యం’ అని బైడెన్ పేర్కొన్నారు.
”ప్రజలకు సహాయం చేయడానికి మన దగ్గర అనేక మార్గాలున్నాయి. మనం ఆ మార్గాలను ఉపయోగించుకుందాం. ఇప్పుడు అన్ని మార్గాలనూ ఉపయోగించుకుందాం” అని ఆయన అన్నారు.
ప్రతి నెలా ఆహార పదార్థాల కోసం పేద కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచడం, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతపడినందు వల్ల ఇళ్లలోనే ఉంటున్న పేద విద్యార్థులకు అదనపు భోజనానికి ఆర్థిక సహాయం అందజేయడం బైడెన్ లక్ష్యం. వీటి కోసమే ఆయన మొదటి ఉత్తర్వు జారీ చేశారు. ఆర్థిక సహాయానికి అన్ని విధాలా అర్హత కలిగి ఉండి, నిధులు అందక అవస్థలు పడుతున్న సుమారు 80 లక్షల మందికి చెక్కులు అందజేయడానికి అవకాశాలను పరిశీలించాల్సిందిగా బైడెన్ ఆర్థిక శాఖను ఆదేశించారు.
తమ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు గంటకు 15 డాలర్ల కనీస వేతనం చెల్లించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన రెండవ ఉత్తర్వు జారీ చేశారు. అవసరమైతే ఉద్యోగులు, కార్మికులు మరింత అధిక వేతనం కోసం డిమాండ్ చేయడానికి కూడా ఆయన అవకాశం కల్పించారు.
మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ వారంలో బైడెన్ శర పరంపరగా తీసుకుంటున్న చర్యల్లో ఈ రెండు ఉత్తర్వులు కూడా భాగం. ఆయన గత బుధవారం అధికారంలోకి వచ్చీ రాగానే అనేక రుణాలను వాయిదా వేయించారు. రుణాల చెల్లింపును మార్చి వరకూ పొడిగిస్తూ కొత్త గడువు కాలాలు విధించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సంస్థల మూసివేతలను కూడా ఆపించాలని, వాటికి ఇతోధికంగా సహాయం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. విద్యార్థులు చెల్లించాల్సిన రుణాలను సెప్టెంబర్ వరకూ పొడిగించాలని ఆదేశించారు.
ఈ ఉత్తర్వులన్నీ ఒక అధ్యక్షుడుగా ప్రత్యేక కార్యనిర్వాహక అధికారాలు ఉపయోగించి చేస్తున్నారు. సాధారణంగా ఎప్పుడో గానీ దేశాధ్యక్షులు ఈ ప్రత్యేక కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించరు. కానీ, అధికారానికి వచ్చిన మూడు రోజుల్లోనే బైడెన్ 29 ఉత్తర్వుల మీద సంతకాలు చేయడమే కాకుండా, అనేక ఆదేశాలు జారీ చేశారు. దీనిని బట్టి ఆయన డొనాల్డ్ ట్రంప్ అజెండాను కాదని, తన సొంత అజెండాతో ముందుకు వెడుతున్నారని అర్థం అవుతోంది.
సుమారు 2.9 కోట్ల మంది పెద్దలు, 1.2 కోట్ల మంది పిల్లలు పూట గడవక, కడుపు నిండక నానా అవస్థలూ పడుతున్నారని, వారంతా ఆహార కేంద్రాల ముందు బారులు తీరి, పడిగాపులు కాస్తున్నారని, ఈ దయనీయ పరిస్థితిని నివారించేందుకే బైడెన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారని వైట్‌హౌస్ కార్యాలయం తెలియజేసింది.
అయితే, అధ్యక్షుడు తీసుకుంటున్న కార్యనిర్వాహక చర్యలు ఒక విధంగా పరిమితమైనవే. దాదాపు కుప్పకూలిపోయి ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఆయన తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువే. కోట్లాది మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయి నానా అవస్థలూ పడుతున్నారు. గత గురువారం నాడు సుమారు 9 లక్షల మంది అదనంగా నిరుద్యోగ బీమా కోసం దరఖాస్తు చేశారు.
ఈ వాస్తవాన్ని గుర్తించిన బైడెన్ తాను ఇటీవల రూపొందించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని ఆమోదించాల్సిందిగా మరొకసారి కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. వెనువెంటనే నిధుల ఖర్చు చేయని పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా కుంగిపోతుందని, అందువల్ల కాంగ్రెస్ వెంటనే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






