డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించిన తులసీ గబ్బార్డ్
డెమోక్రటిక్ పార్టీ మాజీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. పార్టీ ఫిరాయించిన ఆమె ఉపాధ్యక్షురాలు, డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలగిన విధానాన్నీ ఆమె దుయ్యబట్టారు. డెట్రాయిట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌తో కలిసి గబ్బార్డ్ వేదిక పంచుకున్నారు.
పశ్చిమాసియాలో పనిచేసిన గబ్బార్డ్ అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి బాధ్యత వహించాలనే విషయం ట్రంప్‌నకు స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. శాంతి సాధన కోసం శ్రుతువులు, నియంతలు, మిత్రులు, భాగస్వాములు ఇలా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ కలిసే దైర్యం ఒక్క ట్రంప్ మాత్రమే చేయగలరని కొనియాడారు. యుద్ధాన్ని చివరి అస్త్రంగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను తప్పుబట్టారు. వీరి పాలనలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.






