ట్రంప్ ఆగ్రహం…ఓట్ల లెక్కింపు పక్రియపై విమర్శలు
అమెరికా ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి బైడెన్ ముందంజలో ఉండటంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆగ్రహాన్ని బ్యాలెట్ లెక్కింపులపై చూపుతున్నారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పక్రియను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. చట్టపరంగా పోరాడుతున్నప్పటికీ న్యాయం దక్కడంలేదని అంటున్నారు. ఈ దేశాన్ని న్యాయమూర్తులు పరిపాలించాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని తేల్చిచెప్పారు. నిష్పక్షపాతంగా.. న్యాయబద్దంగా ఓట్లను లెక్కిస్తే తామే విజయం సాధిస్తామని అన్నారు. మార్గదర్శకాలు పాటించకుండా అన్యాయంగా విరుద్ధంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నారని.. తమ నుంచి విజయాన్ని దొడ్డిదారిన లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లీగల్ గా ఓట్లు లెక్కిస్తే తామే విజయం సాధిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కౌంటింగ్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయనడానికి తమ వద్ద సాక్ష్యాదారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై కేసులు దాఖలయ్యే అవకాశాలున్నాయన్నారు. జార్జియా ఓట్ల లెక్కింపుపై రిపబ్లికన్ పార్టీల ప్రతినిధులు పిటీషన్ వేస్తే న్యాయమూర్తులు తోసిపుచ్చడం దారుణమని ట్రంప్ మండిపడ్డారు. న్యాయమూర్తులు అమెరికాను పరిపాలించాలనుకుంటున్నారా అని విమర్శలు గుప్పించారు.






