Donald Trump: ఇండో అమెరికన్లకు షాక్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్…!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అంతర్జాతీయంగా అమెరికా (America) విధానాలను బలంగా చాటే విధంగా నిర్ణయాలను ప్రకటించారు. సుమారు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు, విధానపరమైన నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపారు ట్రంప్. ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులపై వేటు వేసిన ఆయన… మరో వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తామంటూ హెచ్చరికలు పంపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేసారు.
అలాగే పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో, కెనడా వస్తూత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం సుంకం విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు. టిక్‌టాక్‌కు మరో 75 రోజులు గడువు ఇస్తూ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో.. తన మద్దతుదారులైన 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో రెండు జెండర్లే ఉంటాయని తేల్చి చెప్పారు.
స్త్రీలు పురుషులుగానే గుర్తిస్తామన్న ఆయన అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామని స్పష్టం చేసారు. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం, తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికా పౌరులు కానట్లయితే, అమెరికాలో జన్మించిన శిశువులకు ప్రభుత్వం పౌరులుగా గుర్తించదు. తాజా జనాభా లెక్కల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ లో 5.4 మిలియన్లకు పైగా భారతీయులు ఉన్నారు. అమెరికా జనాభాలో దాదాపు 1.47% ఉన్నారు. మూడింట రెండు వంతుల మంది వలసదారులు కాగా, 34% మంది అమెరికాలో జన్మించారు. ట్రంప్ నిర్ణయం అమలైతే, తాత్కాలిక ఉద్యోగ వీసాలు లేదా టూరిస్ట్ వీసాలపై దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలకు ఇకపై పౌరసత్వం లభించదు.