కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయన అక్కడ నుంచి పని చేయనున్నారు. ట్రంప్‌కు సంబంధించిన అన్ని అధికార ప్రకటనలు అక్కడ నుంచే వెలుబడనున్నాయి. మరోవైపు క్యాపిటల్ హిల్ దాడి ఘటన నేపథ్యంలో హౌజ్ ప్రతినిధులు ట్రంప్ అభిశంసన కోరుతూ సేనేట్‌కు తీర్మానం పంపిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సేనేట్‌లో అభిశంసన ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో మళ్లీ దర్శనమిస్తానని వైట్‌హౌజ్ ను వీడి వెళ్తున్న సమయంలో ట్రంప్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బైడెన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మ కొట్టిన ట్రంప్.. ఫ్లోరిడాలోని మారా లాగో రిస్టార్ట్‌కు వెళ్లిపోయారు. అయితే ప్యాట్రియాట్ పార్టీ పేరుతో ట్రంప్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ట్రంప్ పార్టీ పెట్టడం లేదని ఈ మధ్యే క్లారిటీ వచ్చింది.






