డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. నేను గెలిస్తే మహిళలకు
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలు మాత్రం వెల్లడిరచలేదు. ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. లేదా మీ బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది అని మిషిగన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
ఐవీఎఫ్ చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకొన్నది. అమెరికాలో ఒక దఫాకు పదివేల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ చికిత్స ఫలవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నందున బహుళ దఫాల్లో తీసుకోవాల్సి రావొచ్చు. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో అనివార్య పరిస్థితుల్లో గర్బవిచ్ఛిత్తి చేయించుకునే హక్కు మహిళలకు ఉందని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అదే అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పును కొట్టివేస్తూ గత ఏడాది మరో తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో గర్భవిచ్చిత్తి విధానంపై ట్రంప్ కొంతకాలంగా భిన్నస్వరాలు వినిపించారు. చివరకు ఈ అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయాలని ప్రతిపాదించారు. దీంతో ఈ విషయంపై ట్రంప్‌ను ఉద్దేశించి డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో తాజా ప్రకటన రావడం గమనార్హం.






