డొనాల్డ్ ట్రంప్ వర్గానికి షాక్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పలు న్యాయ స్థానాల్లో ప్రతికూల తీర్పులు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ వర్గానికి మరో కోర్టులోనూ చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ పార్టీ వేసిన పిటిషన్‌పై కింద కోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్కడ గెలుపొందిన విజేతలకు ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలంటూ కింది కోర్టు నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలను సుప్రీం తాజాగా రద్దు చేసింది. పెన్సిల్వేనియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ రిపబ్లికన్ పార్టీ నేత, ప్రతినిధుల సభ సభ్యుడు మైక్ కెల్లీ గత వారం కామన్వెల్త్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ పోలైన 25 లక్షలకు పైగా పోస్టల్ ఓట్లను లెక్కించకూడదని లేదా పెన్సిల్వేనియా ఫలితాలనే రద్దు చేయాలని ఆయన కోరారు.
దీనిపై విచారణ చేపట్టిన కామన్వెల్త్ కోర్టు న్యాయమూర్తి, గతంలో రిపబ్లికన్ పార్టీ తరపున గెలిచిన పాట్రిసియా మెక్కల్లవ్.. ఎన్నికల్లో గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయకూడదంటూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ డెమొక్రటిక్ పార్టీ సుప్రీంను ఆశ్రయించగా తాజా తీర్పును వెలువరించింది. పెన్సిల్వేనియాలో పోస్టల్ బ్యాలెట్‌పై అభ్యంతరాలకు సంబంధించి గడువు ముగిసిపోయిన నెలల తర్వాత ఈ పిటిషన్ వేశారంటూ పేర్కొంది. ప్రజాస్యామానికి మరో విజయం అంటూ డెమొక్రటిక్ నేత జోష్ షపిరో పేర్కొన్నారు.






