ఆయన కోసం వైట్‌హౌజ్‌ను ఖాళీ చేయను!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్ చివరికి బెదిరింపులకు కూడా దిగుతున్నారు. తాను వైట్‌హౌజ్‌ను ఖాళీ చేయబోనని ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే ఆయన కోసం తాను వైట్‌హౌజ్ ఖాళీ చేయనని ట్రంప్ పట్టు పట్టినట్లు సీఎన్ఎన్ తన రిపోర్ట్‌లో చెప్పింది. ఒకవేళ ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తే అమెరికాలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ రిగ్గింగ్ చేసి గెలిచారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. బైడెన్ విజయాన్ని సవాలు చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి ఎలక్టోరల్ కాలేజీ కూడా బైడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించింది. బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చినట్లు వెల్లడించింది.






