Donald Trump: అందుకే సునీతా విలియమ్స్‌ను వైట్‌హౌస్‌కు పిలవలేదు : ట్రంప్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు అంతరిక్షం నుంచి పుడమికి చేరుకున్నారు. వీరిని రోదసీ నుంచి తీసుకొచ్చిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. దీంతో యావత్ ప్రపంచ వీరికి సాదర స్వాగతం పలికింది. వీరి రాకపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. వ్యోమగాములను వైట్‌హౌస్ (White House)కు ఎప్పుడు పిలుస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వారు ఇన్నాళ్లూ అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ మన శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయి. శరీరం తేలికగా మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఆ పరిస్థితుల నుంచి భూమికి చేరుకున్నారు. ఇక్కడి వాతావరణానికి మళ్లీ అవాటుపడటం అంత సులువు కాదు. అందుకే వారిని ఇప్పుడే శ్వేతసౌధానికి ఆహ్వానించలేదు. ఇంకా చాలా సమయం ఉంది. వాళ్ల పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవల్ ఆఫీసుకు పిలుస్తా అని ట్రంప్ వెల్లడించారు.