జూలై 4 నాటికి కరోనా నుంచి విముక్తి.. వెల్లడించిన బైడెన్
వాషింగ్టన్: కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాలో జూలై 4 నాటికి సాధారణ స్థితి ఏర్పడుతుందని దేశ నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం. ఆ రోజుకల్లా దేశం కరోనా నుంచి విముక్తి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మే 1 నుంచి 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఆయన ప్రకటించారు. జనవరి 20న అధికారం చేపట్టిన బైడెన్.. తొలిసారి అమెరికాలో ప్రైమ్ టైమ్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో దేశాన్ని కరోనా రహితంగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టంచేశారు. దీన్ని సాధించేందుకే మే 1 నుంచి వయోజనులందరికీ వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే తాజాగా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన కరోనా రిలీఫ్ ప్యాకేజి బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1.9 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లుతో కరోనాతో ఇబ్బందులు పడిన అమెరికన్లకు చాలా మేలు చేకూరుతుందని అన్నారు. వచ్చే జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాదని, కరోనా విముక్తి దినం కూడా అనిపేర్కొన్నారు.
కొవిడ్19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో కరోనాను నియంత్రించేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నామని బైడెన్ చెప్పారు. అమెరికాలో కరోనా కారణంగా 5.30 లక్షల మంది వరకూ మృత్యువాత పడ్డారని చెప్పిన ఆయన.. ఇది మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో, అలాగే వియత్నాం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కన్నా ఎక్కువని తెలియజేశారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో 100మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని కేవలం 60 రోజుల్లోనే దాటేసేలా ఉన్నట్లు ఆయన చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు తయారు చేసిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితరం కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారు చేశాయి. ఈ కంపెనీలన్నింటితో అమెరికా ప్రభుత్వాధికారులు కలిసి పనిచేసి, వీటి నుంచి లక్షలాది వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేస్తున్నారిని బైడెన్ తెలియజేశారు. మే 1 నుంచి వయోజనులకు వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు? వంటి సమాచారం అందించేందుకు కొత్త వెబ్సైట్ల రూపకల్పన, సురక్షిత వాతావరణంలో స్కూళ్లు తెరవడం తమ ముందున్న ప్రాధాన్యాలని తెలిపారు. దేశంలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కూడా త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.
ఆసియన్ అమెరికన్లపై దాడులపై స్పందన..
కొవిడ్19 కాలంలో ఆసియన్ అమెరికన్లపై జరిగిన దాడులను బైడెన్ ఖండించారు. కరోనా పుట్టింది చైనాలో అని తెలిసిన తర్వాత చాలా మంది అమెరికన్లు జాతి విద్వేష చర్యలకు దిగి ఆసియన్ అమెరికన్లపై దాడులు చేశారు. ఇలా 2020 మార్చి 19 నుంచి డిసెంబరు 31 వరకూ 2,800పైగా జాతివిద్వేష కేసులు నమోదయ్యాయి. ఇది చాలా దారుణమైన విషయమని చెప్పిన బైడెన్.. ఆసియన్ అమెరికన్లు కూడా మన తోటి ప్రజలను కాపాడటం కోసం ముందు వరుసలో నిలబడి కరోనాతో పోరాడుతున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం ఎంత మాత్రమూ సరైన పని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బైడెన్ వ్యాఖ్యల పట్ట భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్ ఓ ఖన్నా ఆనందం వ్యక్తం చేశారు.






