Trump: జన్మత పౌరసత్వం రద్దు అంత ఈజీ కాదా?

ట్రంప్(Trump) సహా మరే ఇతర యూఎస్ అధ్యక్షుడు ఈ రాజ్యంగ హక్కును రద్దు చేయడం అనేది అంత సులభం కాదు. ముందు అమలు చేయనున్న ఈ బిల్లుకి అమోదం లభించాలంటే హౌస్(దిగువ సభ), సెనెట్(ఎగువ సభ) రెండింటిలోనూ మూడింట రెండో వంతు ఓట్లు అవసరం. ఆ తర్వాత మూడు వంతుల అమెరికా రాష్ట్రాలు అమోదం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అమలు అవ్వడం అనేది అంత సులభం కాదనేది విశ్లేషకులు అభిప్రాయం. మరోవైపు కోర్టులో ఇప్పటికే దీనిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఒకకోర్టులో దీనిపై స్టే కూడా వచ్చింది. ట్రంప్ వర్గం మాత్రం దీనిపై తాము వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ప్రభుత్వం కూడా దీని అమలుపై కసరత్తును ముమ్మరం చేసింది.
మరోవైపు అక్రమ వలవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్ చేసి ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపించింది. (డిపోర్టేషన్). సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.
మోదీ అమెరికా పర్యటన లాభిస్తుందా?
అమెరికా అధ్యక్షపగ్గాలు చేపట్టినవెంటనే జారీ చేసిన ఉత్తర్వులతో ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi) తో ఫోన్‌లో జరిపిన సంభాషణల వివరాలు, మోదీ అమెరికా పర్యటన గురించి తెలియజేయడం ఆసక్తిని కలిగించింది.
భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వైట్‌హౌజ్‌ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తెలిపారు. దేశాధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో ప్రధాని మోదీ ఇటీవల ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణ గురించి ట్రంప్ వెల్లడిరచారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్న సమయంలో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడనని, ఆయన వైట్‌హౌజ్‌కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేతసౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్నట్లు తెలిపారు. ఇండియాతో తమకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ పేర్కొన్నారు.మోదీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు వార్త. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే క్వాడ్ సదస్సు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.కాగా, భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుందని భావిస్తున్నారు. మోదీ పర్యటన తరువాత మనవాళ్ళకు ఏమైనా మేలు జరుగుతుందా లేదా వేచి చూడాలి.
విద్యార్థులో భయం… జాగ్రత్తలు తప్పనిసరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడంతో చాలామంది విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారం కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్ 1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు.
అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల విషయంలో మాత్రం కఠినంగా నిబంధనలు అమలయ్యే అవకాశాలు ఉన్నందువల్ల జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఎఫ్ 1 (స్టూడెంట్ వీసాలు), హెచ్1 (వర్క్ వీసాలు), ఎల్ 1 (ఇంట్రా-కంపెనీ బదిలీలు), బి1,బి2 (టూరిస్ట్/బిజినెస్ వీసాలు)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే అధికారులు మాత్రం పాలసీ మార్పులు ఏవైనా అమల్లోకి తెచ్చే ముందు.. రెండువైపులా అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది. ఇక.. టైర్ 1, టైర్-2లకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. విశ్వవిద్యాలయానికి, చేసే కోర్సులతో సంబంధం లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని ఎఫ్1 వీసాదారులకు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎఫ్1 నిబంధనలకు లోబడిన పనులే చేసుకోవాలని, ఆ పరిధి దాటి పనులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.