ఇది చాలా తప్పు.. వారు అమెరికా ప్రజలు కాదు
కరోనా మహామ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆసియా అమెరికన్లపై చేస్తున్న దాడులు, వేధింపులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఇటువంటి వాటిని విద్వేషపూరిత నేరాలుగా పేర్కొన్న ఆయన నిజమైన అమెరికన్లు (అన్-అమెరికన్) అయితే ఇటువంటి చర్యలకు పాల్పడరంటూ వ్యాఖ్యానించారు. వీటిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. బైడెన్ తన తొలి ప్రైమ్ టైమ్లో ప్రసంగిస్తూ కోవిడ్ 19కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన పురోగతి గురించి వివరించారు. కరోనా వైరస్ చైనాలో ఉద్భవించిదంటూ ఆసియా అమెరికన్లపై దాడులు, వేధింపులు, ఈసడింపులు, నిందలు, బలిపశువుల్ని చేయడాన్ని దుర్మార్గపు ద్వేషపూరిత నేరాలుగా పేర్కొన్న ఆయన ఈ చర్యలను ఖండించారు. ఇది చాలా తప్పని.. దాడులకు పాల్పడే వారు అమెరికా ప్రజలు కారని, ఇటువంటి వాటిని నిలిపివేయాలని వ్యాఖ్యానించారు.






