అగ్రరాజ్యంలో ఇది ఎప్పుడూ ఉంటుంది : కమలా హ్యారిస్
అగ్రరాజ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న జాత్యహంకారంపై మౌనం వీడాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. జాతివిద్వేషం ఎంతమాత్రం మంచిది కాదని, దీనిపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అట్లాంటాలో ఆసియన్ అమెరికన్ మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఎమిమిది మంది మృతిచెందగా.. వీరిలో ఆరుగురు ఆసియా మహిళలు ఉన్నారు. ఈ జాత్యహంకార దాడులను కమల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ఉపాధ్యక్షురాలు ఆసియా కమ్యూనిటీతో అట్లాంటాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ అమెరికాలో జాత్యహంకారం ఉన్న మాట వాస్తవం. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇకపై నేను అధ్యక్షుడు దీనిపై మౌనం వహించబోయేది లేదు. హింస, జాతివిద్వేషం, వివక్షత, ఎక్కడ, ఎప్పుడు జరిగినా మేము మాట్లాడుతాము అని ఆమె అన్నారు.






