Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్ కార్డ్ ‘లాటరీ’కి ఎండ్ కార్డ్!
అమెరికా వలస విధానాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు, చర్చలు కొనసాగుతున్న తరుణంలో, అగ్రరాజ్యం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే ‘డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ’ (Green Card) విధానాన్ని రద్దు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది.
దేశంలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, అక్రమ వలసలపై వెల్లువెత్తుతున్న రాజకీయ ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు డీవీ లాటరీ (Green Card) ద్వారానే అమెరికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలు రావడంతో, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఏమిటీ డీవీ లాటరీ?
అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వచ్చే దేశాల పౌరులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో 1990లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఏటా (Green Card) లాటరీ పద్ధతిలో సుమారు 50 వేల మందికి గ్రీన్ కార్డులు (శాశ్వత నివాస హోదా) మంజూరు చేసేవారు. ఆఫ్రికా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు అమెరికా వెళ్లేందుకు ఇది ఒక సులువైన మార్గంగా ఉండేది.






