Donald Trump :నేనొచ్చాను.. స్వర్ణయుగం తెచ్చాను

రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలను తాను చేపట్టడంతో స్వర్ణ యుగం మొదలైందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )తెలిపారు. ప్రపంచమంతా త్వరలో శాంతియుతంగా, సుసంపన్నంగా ఉంటుందన్నారు. చమురు ధరల్ని తగ్గించాల్సిందిగా సౌదీ అరేబియా(Saudi Arabia)ను, ఒపెన్ దేశాలను కోరుకున్నానని, వాటి ధరలు తగ్గితే రష్యా(Russia), ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం దానంతట అదే ఆగిపోతుందని తెలిపారు. దావోస్(Davos)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇతరులు, నాలుగేళ్లలో చేయలేని పనుల్ని మా ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే చేసి చూపించింది. త్వరలో అమెరికా మరింత బలంగా, ఐక్యంగా, ఎన్నడూ లేనంతా సంపన్నంగా మారనుంది. దీనివల్ల ప్రపంచమంతా లబ్ధి పొందనుంది. అప్రయోజకుల బృందం వల్ల అమెరికాకు ఎదురైన నష్టాలను సరిచేయడానికి అసాధారణ వేగంతో పనిచేస్తున్నాం. ప్రతి కొత్త నియంత్రణ ద్వారా 10 పాత నియంత్రణలను అంతంచేస్తా. ప్రజలకు సాయపడేందుకు భారీగా పన్నుకోతలు విధించబోతున్నా. అమెరికాలో ఉత్పత్తులు తయారు చేయకుండా వ్యాపారం చేసుకుంటున్న వారిపై టారిఫ్‌లు వడ్డిస్తా అని ట్రంప్ తెలిపారు.