నాదబ్రహ్మోత్సవం–26 ఏడవ రోజున ఆలరించిన వారనాసి సౌమ్య భక్తి సంగీతం
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం–26లో భాగంగా అక్టోబర్ 17న నిర్వహించిన సంగీత కార్యక్రమం భక్తి సంగీత మాధుర్యంతో అలరించింది. ప్రముఖ గాయని శ్రీమతి వరణాసి శ్రీ సౌమ్య తన మధుర గానంతో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాయంత్రం 4:30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, శ్రీ లలితా సహస్రనామ పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీమతి వరణాసి శ్రీ సౌమ్య “నగవులు, భావయామి, వందేహం జగద్గురుం, కొండల్లో నెలకొన్న, చాలదా హరినామ” సంకీర్తనలు ఆలపించగా అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు సంయుక్తంగా “చిత్తము కొలది, హరి అవతారమితడు” తదితర సంకీర్తనలను భక్తిపూర్వకంగా ఆలపించారు.
ఈ కార్యక్రమానికి రాజు కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు.
ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖ అతిథులు అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న సేవలను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కళాకారులకు వేదికలు కల్పిస్తూ, భక్తి సంగీతాన్ని భావితరాలకు అందించడంలో పద్మశ్రీ డా. శోభారాజు గారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
నాదబ్రహ్మోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం దుర్గాష్టమి వేడుకల్లో భాగంగా విశిష్ట సేవలు అందించిన మహిళకు ప్రదానం చేసే ‘ధైర్య’ పురస్కారాన్ని ఈ ఏడాది సిద్ధచక్ర రీసెర్చ్ సెంటర్కు చెందిన డా. భువనగిరి సత్య సింధుజ గారికి అందించనున్నారు.
అక్టోబర్ 18న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొని పురస్కార ప్రదానం చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో డా. డి. నాగేశ్వర్ రెడ్డి గారికి ‘నవ వైష్ణవ’ బిరుదు కూడా ప్రదానం చేయనున్నారు.
ఈ వేడుకలకు భక్తులు, సంగీతాభిమానులు, కళాప్రియులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నమాచార్య భావనా వాహిని నిర్వాహకులు ఆహ్వానించారు.
నాదబ్రహ్మోత్సవం ద్వారా అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, దివ్య సంగీతం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే సంస్థ సంకల్పం కొనసాగుతోంది.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.








