తెలుగు అక్షరానికి వెలుగు కిరణం
మన దేశం బ్రిటీష్ దాశ్య శృంఖలాలనుండి విముక్తి పొంది దాదాపు 70 వసంతాలు దాటినా ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్య పాలనా వ్యవస్థ సజావుగా కొనసాగేందు వీలుగా బ్రిటీష్ మార్కు ‘మెకాలే’ గుమాస్తాగిరుల విద్యావిధానం అనేక విమర్శలకి గురైనా కూడా, ఆనాడే ఆ విధానాలకు భారతీయ వ్యవస్థలో అంకురార్పణ జరిగిందనేది అక్షర సత్యం. మనదేశంలో అధిక జనాభాలో తమదైన వృత్తులలో జీవనాన్ని సాగించే వారే ఎక్కువ కానీ వృత్తివిద్యలతో సంబంధంలేని, వాటి అభివృద్ధికి నోచుకోని విద్యా విధానాలు పరాయి పీడ పాలన పోయినా తర్వాత కూడా కొనసాగుతూ నేటి మన దేశంలో అన్ని మాతృభాషలలో ఆంగ్లభాష చొరబడి ఆంగ్లమే మనకిక ఆక్సిజన్ అనే రీతిలో దేశంలోని అన్నిమాతృ భాషల మనుగడలను గాలిలో ఊగిసలాడే దీపాలుగా ఉక్కిరి బిక్కిరి చేస్తోందనేది స్పష్టం.
ముఖ్యంగా మన మాతృభాషైనా తెలుగుకు కూడా ఇది మినహాయింపు కాకపోగా ఆంగ్లమే అన్నిరంగాలలో అధికారమై మన మీద కూర్చొని చివరకు అది ‘తెలుగింలీష్’ గా మారిపోయింది. మన తెలుగు భాష ను పరభాషగా మనమే దూరం చేసుకొనే పరిస్థితులు వచ్చాయి. ఈ ఆంగ్లభాషా వ్యామోహం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా పల్లెల్లో కూడా దీని ప్రభావం ఎక్కువౌతోంది. దీనివలన ముఖ్యంగా విద్యార్ధి, యువత అటు ఆంగ్లంలో ముందుకు పోలేక ఇటు తెలుగులో పట్టులేక ఉభయ భ్రష్టంతో చదివిన చదువులకు తగ్గ ఉపాధులు లేక ఆత్మన్యూనతతో, తీవ్రమైన మానసిక సంఘర్షణలకు లోనౌతున్నారనేది మన కళ్ళముందున్న యదార్ధ దృశ్యం! ఇదేదో చిన్న విషయం కాదు భవిష్యత్ తరాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన నేటి విద్యార్ధి,యువత పరభాషా వ్యామోహంలో కోనసాగుతున్న విద్యావిధానాలలో నైపుణ్యాలు అందుకోవటంలో వెనుకబడటానికి కారణం చదువుల్లో అర్ధం తెలిసికోవటంకంటే మార్కుల ఆర్భాటాలకే ప్రాధాన్యతలు పెరగటం! దాదాపు దశాబ్దాలుగా చదువుల్లో తెలుగు భాషా ప్రాధాన్యతకై ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సమావేశాలు, మరెన్నో పత్రికా సంపాదకీయాలు,ఎన్నోరాజకీయ ఉపన్యాసాలు, మరెందరో పెద్దల ఆవేదనల పరంపరలు కొనసాగుతూనే వున్నా ఆచరణ రూపంలో మాత్రం సమస్య పరిష్కారం వెనుకబాటగానే నడుస్తోంది.
పుట్టుకతోనే మన భాష తెలుగు భాష మరి మాతృభాష స్థాయిల్లో ఆంగ్లం నేర్చుకోవటం వాస్తవంలో అందరికి సాధ్యమైయ్యే పనేనా? అసలు ఆ స్థాయిల్లో నేర్చుకొనేవారెందరు! అంత నిపుణతతో నేర్పే వారెందరు? మన సామాజిక పరిస్థితుల కనుగుణంగా మన విద్యా విధానాలుండాలి. నేల విడిచి చేసే సాము ఎప్పటికైనా చేటే! ఎటువంటి ఉద్వేగాలకు లోను కానీ విధంగా నేర్చే, నేర్పే చదువులే విద్యార్ధి దశలో పిల్లలకు వంటబట్టేది. కానీ వాస్తవంలో జరుగుతోందేమిటి? కాన్వెంట్ స్కూళ్ల సంస్కృతులు భేషజాలకు, ఆడంబరంగా వేయించే దుస్తుల వేషాలకు, చూసుకొని మురవటానికి పనికి వచ్చే మార్కుల పట్టాలు కాగితాలకే పరిమితమై నేటి చదువులు గుదిబండలుగా పిల్లల సహజ మానసిక స్థితిగతులను దెబ్బ తీస్తున్నాయి. అదే సందర్భంలో ఆంగ్ల భాషా ప్రయోగాలు బలవంతంగా పిల్లలపై ప్రయోగించబడుతూ అర్ధం చేసికోలేని విద్యార్ధులకు శారీరకంగా శిక్షలు లేదా జరిమానాల ప్రహసనా ఉదాహరణలు మనముందు అనేకం. ఈనాటి ఈ విద్యావ్యవస్థలో ఈ భాషా హింసకు నలిగిపోతున్న విద్యార్థులు, యువత కోట్ల సంఖ్యలో ఆత్మన్యూనతా భావాలతో నలిగి పోతున్నారనటంలో అతిశయోక్తి లేదు, అతిశయోక్తి కాదు!
ఆంగ్లభాషే మనకు ప్రధాన మనుకుంటే అందుకు అసలు నేర్పే వారి నిపుణతలు ఏమిటి? నేర్పేవారెంతమంది వున్నారు మనవద్ద? మనకు తగ్గట్టుగా మనం నడవటం, నడపటం అనేదే నిజమైన పరిణితి. భిన్నమైన పరాయి సంస్కృతులు ఎప్పటికైనా ప్రమాదమే. పర భాషను నేర్చుకోవటం తప్పులేదు, తప్పుకాదు అందుకనే విభిన్న జాతులున్నమనదేశంలో మొదట మాతృభాషకు, రెండు జాతీయ భాషకు మూడవదిగా అంతర్జాతీయానికి ప్రాధాన్యతలుగా ఉండాలి. ఇది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించని విధానం! మరి ఆ విధంగా మన నేటి విద్యావ్యవస్థ లో ఉందా? ఇది ప్రతి తెలుగు వారు ఆలోచించాల్సిన విషయం! ఇక మన ఆంగ్ల భాష ప్రభావం యెంత బలంగా మనమీద ఉందంటే తెలుగులో ఒక వాక్యం వ్రాయాలంటే అందులో కనీసం కొన్నే ఆంగ్ల పదాలు లేకుండా ఆ వాక్యం పూర్తికాదు. ఇది మన అమ్మ భాష కున్నప్రస్తుతం స్థానం! “అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా” అన్న కాళోజీ ఆవేదన ఈనాడు ప్రతి తెలుగు భాషాభిమానులందరి ఆవేదనే! ఆంగ్లం అంటించిన అగ్ని కేవలం విద్యార్ధి, యువతతోనే కాదు సుమా! ఆంగ్ల భాషా వ్యామోహం ప్రతి కుటుంబాలలో కనపడుతోంది. అమ్మలు – మమ్మీలుగా,మామ్ లుగా ,తండ్రులు- డాడీలుగా, డాడ్ లుగా రూపాంతరం చెందుతూ చివరికి ఈ పరభాషా వ్యామోహంలో ముందు ముందు ఏమి కానున్నారో!
పరభాష నేర్చుకోవటం తప్పుకాదు, తప్పులేదు కానీ దానికి మన మాతృ భాష తెలుగును ఫణం పెట్టి కాదు. ఆంగ్లమే మన వ్యవస్థలో ప్రధాన ఇరుసే అనుకుంటే మన దేశం లోని నాగాలాండ్ రాష్ట్ర మాతృ భాష ఆంగ్లమే మరి వారే ఈనాటి వ్యవస్థలోని అన్ని ప్రధాన రంగాలలో మరి వారే ఉండాలి అలా జరుగుతోందా? మన భాష, మన చదువు,మన విజ్ఞానం, మన పట్ల మన అవగాహన ,మనం చేయబోయే పనిపట్ల విచక్షణతో కూడిన సంస్కృతీ మనకు సంప్రదాయంగా ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తెరగవలసిన ఒక ప్రధాన విషయం మాతృభాషపై పట్టు ఉంటేనే పరభాషను కూడా సులువుగా నేర్చుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటె మనం ఏ పదాన్నైనా ఆంగ్లంలో పలకాలన్న అది మొదటగా మన మాతృభాష స్ఫురణ నుండే వస్తుందనేది మరవద్దు. ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి రాష్ట్రం తమ సంస్కృతీ ,సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే మొదటగా మాతృ భాషకే ప్రాధాన్యతన ఇస్తారనేది వాస్తవం.
సామాజిక, సాంఘిక దురాచారాలు మానవ జీవన విలువలను తేలికపాటి తెలుగులో వ్రాసిన వేమన పద్యాల ప్రాముఖ్యతలు వెలుగులోకి తెచ్చింది బ్రిటీష్ పౌరుడు సి.పి.బ్రౌన్, దేశ భాషలందు తెలుగు లెస్స అనటమేకాదు ఆముక్తమాల్యద గ్రంధాన్ని తెలుగులో వ్రాసి ప్రపంచానికి అంద చేసింది కన్నడీయుడు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాలనేది బహుశ మనకందరికీ తెలిసిన విషయమే. “అంతటి వెలుగున్నది మన తెలుగులో”. అందుకే అమ్మకు ఎంత గౌరవ స్థాన ముంటుందో అమ్మ భాషకూ అంతే గౌరవ స్థాన ముండాలి. మాటలు కోటలు దాటాయి అడుగులు గడపలు దాటలేదు. దశాబ్దాలుగా ఇది నిజంగా మన అమ్మ భాషకు పట్టిన దుర్గతే! ఫలితంగా మనం, మన తరం మన మాతృభాష తెలుగు ను దూరం చేసుకుంటూ చేస్తున్న తప్పిదం!
ఎడారిలోఒయాసిస్సులా మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజా మనోభావాలకు ఆలంబనగా “వొట్టిమాటలు కట్టి పెట్టి గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న గురజాడ వారి మాటలు సాకారమయ్యే రీతిలో “తెలుగు అక్షరానికి వెలుగు కిరణం తాపడమైంది” అదే తెలంగాణా రాష్ట్రం తీసుకొన్న ఒక చారిత్రక నిర్ణయం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు తెలుగు పాఠ్యాంశం తప్పనిసరి చేయటం. ఇది నిజంగానే తెలుగు మాటకు పట్టిన మహర్దశ. చట్టం చేయటం దాని అమలుకు కృషి చేయటం ప్రభుత్వ విధి విధానమైతే, ఆ చట్టాన్ని గౌరవించి అమలుకు సహకరించి ఆచరణలో కొనసాగించాల్సిన బాధ్యత మనది మరియు మన తెలుగు సమాజాలలో ఉన్న ప్రతి విద్యాసంస్థది. ఇది నిజంగా తెలుగు భాషా ప్రియులందరికీ సంతోషకరమైన విషయమే. అదే సందర్భంలో ప్రతి విద్యార్ధి , యువత తమ భావి జీవిత ప్రణాళికలను రూపొందించుకొని అభివృద్ధి అంచులకు చేరేందుకు ఇది ఒక మానసిక భరోసా. “అమ్మ భాషకు పట్టం కట్టటమంటే మరి అమ్మకు పట్టం కట్టటమే.”
అమరనాథ్ . జగర్లపూడి,
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్,
9849545257













