దాసరి నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు
ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి నారాయణరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మొదట్లో ఉదయం పేరుతో దినపత్రికను స్థాపించి దానికి సంపాదకుడుగా పనిచేశారని, తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని ఆయన అన్నారు. కేంద్రమంత్రిగా దాసరి పని చేశారని, సర్వజనహితాభిలాషిగా, అందరితో మంచిగా ఉంటూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దన్నగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి మరణం చాలా విచారకరమని అన్నారు. తెలుగు తమిళ్ ఇతర భాషల్లోకూడా దాసరి పేరు ప్రఖ్యాతలు సాధించారని వెంకయ్య కొనియాడారు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













