ఆ మాటలకు కంగారు ఎందుకు? : విజయశాంతి
సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకుని మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. గ్రెటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ తాము గెలిస్తే పాతబస్తీలోని పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే. అయితే తాజాగా సంజయ్ వ్యాఖ్యలపై విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకుని, రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎంకు భయమెందుకుని సూటిగా ప్రశ్నించారు. దానికి బదులు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు.













