అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం
అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్టూడెంట్ పోయెట్ రాయబారిగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన కీత విధాత్రి ఎంపికయ్యారు. 50 రాష్ట్రాల నుంచి అయిదు లక్షల మంది పోటీల్లో పాల్గొన్నారు. వివిధ దశల్లో జరిగిన పరీక్షల్లో విజయం సాధించిన అయిదుగురిని చివరి దశకు ఎంపిక చేశారు. ఈ రౌండ్లో ప్రతిభ కనబరిచి విధాత్రిని యంగ్ పోయెట్ రాయబారిగా నియమించారు. వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విధాత్రికి మెడల్ బహుకరించారు. 5,000 డాలర్ల పారితోషికం ఇచ్చి సత్కరించారు. కీతవారిగూడేనికి చెందిన నాగేశ్వరరావు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ రీత్యా 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లారు. ఆయన కుమార్తె విధాత్రి.













