కాంగ్రెస్ కమిటీల్లో కీలక బాధ్యతలు..! ఉత్తమ్ పార్టీ మార్పుకు చెక్ పడిందా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరూ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంతో మంది నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక సీనియర్లయితే తమకు కాకపోతే ఇంకెవరికి టికెట్ ఇస్తారనే ధీమాలో ఉన్నారు. అయితే పార్టీ మారేందుకే టికెట్ కోసం అప్లై చేసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. నేడోరేపో ఉత్తమ్ పార్టీ మారడం ఖాయమని ఇన్నాళ్లూ జోరుగా ప్రచారం సాగింది. తాను పార్టీ మారట్లేదని, తనకు అలాంటి ఉద్దేశం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వచ్చినా ఆరోపణలకు బ్రేక్ పడలేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని నిన్నమొన్నటి వరకూ జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సమావేశాలకు డుమ్మా కొట్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ కు రావడం తగ్గించేశారు. రేవంత్ రెడ్డి దగ్గర పనిచేయడం కష్టమని.. అందుకనే తన దారి తాను చూసుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీ అయ్యారని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు కూడా ఉత్తమ్ పార్టీ మారబోతున్నారని.. అందుకు రేవంత్ రెడ్డే కారణమని చెప్పుకొచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గాంధీ కుటంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజీవ్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. రెండు సార్లు ఎంపీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు. రెండు సార్లు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. గాంధీ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీలో తిరుగులేకుండా పోయింది. అయితే రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసంతృప్తితో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని అనుకున్నారు.
అయితే.. అందుకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర కమిటీల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం లభించింది. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏర్పాటైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే స్థానం దక్కింది. సోనియా, రాహుల్ లాంటి హేమాహేమీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు… తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారడం ఖాయమనుకుంటున్న సమయంలో ఆయనకు ఇలా కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని.. పార్టీ మారబోనని చెప్తున్నారు.













