22 భాషల్లో ఏ భాషలోనైనా… రాసుకోవచ్చు
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం యూపీఎస్పీతో పాటు పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమినన్ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ రాజ్యాంగం పట్ల అవగాహనతో మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో మాత్రమే కొత్తగా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరగడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. వాస్తవాలను వక్రీకరించి బీజేపీ ఎంపీలు యువతను రెచ్చగొట్టొద్దని సూచించారు.
భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా, రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా బీజేపీ ఎంపీలు యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని తెలిపారు. విద్వేషాలను పెంపొందించే విధంగా మాట్లాడటం విచారకరం అని అన్నారు. బీజేపీ ఎంపీలకు రాజ్యాంగం పల్ల అవగాహన లేకపోవడం విచారకరం అని అన్నారు.













