ప్రపంచ రికార్డు సృష్టించిన మాలావత్ పూర్ణ
పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించింది. ఏడు ఖండాల్లో ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన (7 సమ్మిట్స్ చాలెంజ్) ఘనత సొంతం చేసుకొన్నది. హైదరాబాద్కు చెందిన ట్రాన్సెండ్ అడ్వెంచర్ నిరహించిన సాహస యాత్రలో పాల్గొన్న పూర్ణ తెలంగాణ పేరును నలుమూలలా వ్యాప్తి చేసింది. మే 18న పర్వతారోహణకు బయలుదేరిన పూర్ణ మే 19న అలాస్కాలోని యాంకరేజ్ నగరానికి చేరుకొన్నది. ఆమెతో భారత్ నుంచి మరో 4 మంది జట్టు సభ్యులు ఉన్నారు. వీరంతా మే 22న టాకిట్నాకు వెళ్లారు. మౌంట్ డెనాలి నేషనల్ పార్కులో వివరాలు నమోదు చేసి, మే 24న బేస్ క్యాంపునకు చేరుకొన్నారు. అక్కడి నుంచి మౌంట్ డెనాలి అధిరోహణను ప్రారంభించారు. జూన్ 5న పూర్ణ తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ 2014లో ఎవరెస్టును అధిరోహంచి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.













