తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెల 14 ఓట్లు లెక్కించనున్నారు.













