మే 1 నుంచి తెలంగాణలో లాక్ డౌన్..!?

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పేలా లేదు. కేసులు భారీగా పెరిగిపోతుండడం.. మరోవైపు హైకోర్టు ప్రతిరోజూ మొట్టికాయలు వేస్తూ ఉండడంతో కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇవాళో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. బహుశా ఒకటో తేదీ నుంచే లాక్ డౌన్ విధించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ పెడతారా.. లేకుంటే జిల్లాల వారీగా లాక్ డౌన్ ఉంటుందా.. అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఉంది. పలు దఫాలుగా ఇప్పటికే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. కఠిన ఆంక్షలు తీసుకోవాలని.. లేకుంటే తామే రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ వస్తోంది. తాము కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని.. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నామని అటు పోలీసులు, ఇటు వైద్యాధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏమాత్రం సంతృప్తిగా లేదు. కేసులు కట్టడి చేసేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ తుది ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు అధికమవుతున్నాయి. కేసులు ఇదే తీరుతో నమోదవుతూ ఉంటే ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకవని.. హెల్త్ ఎమర్జెన్సీ ఖాయమని వైద్యశాఖ భావిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించింది. పరిస్థితి చేయి దాటక ముంచే చర్యలు తీసుకుంటే మంచిదని సూచించింది. అటు పోలీసు శాఖ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై తమవైపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఓ వైపు హైకోర్టు, మరోవైపు వివిధ శాఖలు.. తెలంగాణలో కరోనా కట్టడికి నివేదిక సమర్పించాయి. వీటిపై హోంమంత్రి మెహమూద్ ఆలీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోంశాఖ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరూ లాక్ డౌన్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 30 తర్వాత అంటే ఒకటి లేదా రెండో తేదీ నుంచి లాక్ డౌన్ పెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న సీఎం కేసీఆర్ తో ఓ సారి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ పెడితేనే మంచిదనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేసినట్లు సమాచారం.