‘ఆర్టీసీ’లో ఉత్కంఠ
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లు.. రాజ్ భవన్ లో ఆగేసరికి సంఘాలు, సంఘ నేతలకు కోపమొచ్చేసింది. ఏకంగా గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించేస్తామంటూ బయలుదేరారు. స్వయంగా గవర్నర్ తో కొందరు నేతలు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడితే కానీ వారి కోపం ఆగలేదు. మీకు న్యాయం చేయాలనే మాప్రయత్నాలంటూ గవర్నర్ చెబితే అప్పుడు మెత్తబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ కార్మికసంఘాలు ఇంకా క్రియాశీలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇదే పౌరుషం, ఇదే కోపం, ఇదే కసి … ఆనాడు ఇచ్చిన హామీలు పట్టించుకోని కేసీఆర్ సర్కార్ పై ఎందుకు కనబర్చలేకపోయారన్నదే ప్రశ్న?
సకలజనుల సమ్మె సందర్భంగా… విధులు బహిష్కరించి ఉద్యమం కోసం నిలబడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. తమ డిమాండ్లు పట్టించుకోవాలని సమ్మె చేస్తే కఠినంగా వ్యవహరించింది.. సంఘాల్లో చీలిక తెచ్చి సమ్మెను కఠినంగా అణిచివేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పైగా బస్సుల్లో కొన్నింటిని ఆదాయం రావడం లేదని కారణం చూపిస్తూ.. కొరియర్ సర్వీసులుగా మార్చేశారు. ఇంత చేసినా ఎవరూ ఏమీ అనలేకపోయారు.
ఆతర్వాత కూడా సగం సేలరీలతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు. కాళ్లా, వేళ్లా పడిన ప్రభుత్వం కనికరించలేదు. అప్పుడు కూడా సర్కార్ దయ మా ప్రాప్తమన్నట్లు వ్యవహరించారు. కనీసం వ్యతిరేకంగా ప్రకటన చేయడానికి భయపడ్డారు. అంతే కాదు.. ఆ ఊసే మర్చిపోయారు. ఇప్పుడు ఎన్నికల సమయం సమీపించేసరికి.. ప్రభుత్వం పిలిచి ఉద్యోగులుగా మార్చేస్తామనేసరికి పాలాబిషేకాలు మొదలయ్యాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు న్యాయ కారణాలతో గవర్నర్ .. బిల్ పెండింగ్ పెట్టేసరికి మాత్రం కార్మిక సంఘనేతలకు కోపమొచ్చేసింది. రాజ్ భవన్ ముట్టడించడానికి చూశారు. ఎక్కడ బిల్లు లేటవుతుందో, ఎక్కడ ఈ అవకాశం పోతుందో అన్న భయం వారిలో కనిపించింది. అయితే ఒక్క ప్రకటన, బిల్లు ఆమోదిస్తే సరిపోతుందా? పూర్తిస్థాయిలో కార్మికులకు న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే చేస్తున్నామన్న గవర్నర్ తమిళిసై ప్రకటనలోనూ అర్థముంది. కాస్త లేటైనా పూర్తిస్థాయిలో కార్మికులకు న్యాయం జరిగితే అంతే చాలు. ఇది గవర్నర్ అయినా మరొకరైనా .. చిత్తశుద్ధితో ప్రవర్తిస్తే మంచి పరిణామంగా భావించొచ్చు.













