హోరా హోరీ పోరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అన్నీ పార్టీల్లో వేడి పెరిగింది. దానికితోడు ప్రతిపక్షపార్టీలు కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నాయి. ప్రకటించాయి. కాగా తెలంగాణలో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. కొన్ని చోట్ల త్రిముఖ పోరు కనిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్విముఖ పోరు కనిపిస్తోంది. అధికార పార్టీ బీఆర్ ఎస్-ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఎక్కువ నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు కనిపిస్తోంది. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య త్రిముఖ పోరు కూడా నెలకొంది. మరోవైపు కొన్నినియోజకవర్గాల్లో పోరు ఏకపక్షంగా మారింది.
అన్నీ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో అన్నీ పార్టీల్లోనూ అసమ్మతి కనిపిస్తోంది. దాంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అసమ్మతిని ఎదుర్కొంటున్న నేతలు తమ పార్టీలను వీడుతూ ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. పార్టీల మధ్య మాటల యుద్ధం, ఎన్నికల హామీలతో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 54 నిర్ణయాత్మక స్థానాలు దక్కే అవకాశం ఉన్న మూడు ప్రధాన పోటీదారులైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు డూ ఆర్ డై పోరును ఎదుర్కొంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్.. కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు, మూడు ప్రధాన పోటీదారులైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ప్రాంతంలో డూ-ఆర్-డై పోరును ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే అధికారం దక్కించుకునేందుకు కీలకంగా ఉన్న 54 నిర్ణయాత్మక స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందుకే అన్ని పార్టీలు ఈ ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి కాంగ్రెస్ మూడు రోజుల విజయభేరి బస్సు యాత్ర నిర్వహించింది. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నవంబర్ 1 నుంచి 9 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) పర్యటించి పలు సభల్లో మాట్లాడుతున్నారు.
పోల్ సర్వేలు ఏమి చెబుతున్నాయి?
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు ఆరేడు సంస్థలు తమ ప్రీపోల్ ఓటర్ సర్వే ఫలితాలను ప్రకటించాయి. ఇందులో ఒక సర్వే మినహా మిగిలినవన్నీ బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రానున్నట్టు ప్రకటించాయి. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రచారం జరుగుతోంది. తెలంగాణ చాంపియన్లం తామే అన్న బీజేపీ కనీసం పోటీలో కూడా ఉన్నట్లు ఏ ప్రీపోల్ ఓటర్ సర్వే ఫలితం చెప్పడం లేదు. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే 62 సీట్ల సింపుల్ మెజారిటీ అవసరం.
బిజెపి విషయానికి వస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొంత ఉత్సాహంతో కనిపించింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేషన్ స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం, వరుసగా వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి స్పీడ్ బ్రేకర్‌గా మారినా 2023 శాసనసభ ఎన్నికల్లో ఛాంపియన్లం తామే అన్నంత విశ్వాసం పెరిగిపోయింది.
మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా రాష్టంలో బాగానే పుంజుకుంది. పదేళ్ల పాలన తర్వాత సహజంగానే ప్రభుత్వాలపై ఏర్పడే వ్యతిరేకతను బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత ఎదుర్కుంటోంది. ఈ వ్యతిరేకతను అందింపుచ్చుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈలోగా పొరుగున్న ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని కూల్చి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇక్కడి కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపునిచ్చింది. మొత్తంగా ప్రధాన రాజకీయ పక్షాల ఆకాంక్షలను గమనిస్తే.. ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో ఉన్నారు. అంటే తెలంగాణలోని మెజారిటీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు తమ ప్రీపోల్ సర్వేల ఫలితాలను ఓటర్లకు మీదకు వదులుతున్నాయి.
ఏదీ ఏమైనా తెలంగాణ ఎన్నికల ప్రచారం ముమ్మరమైన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది.













