నేడే తెలంగాణ బడ్జెట్….
రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2020-21)ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుత సంక్షేమాలను కొనసాగించేలా బడ్జెట్ ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. 2 లక్షల కోట్లకు చేరువలో ఈ బడ్జెట్ ప్రతిపాదనలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2020-21 బడ్జెట్ ను ఆమోదించిన మంత్రివర్గం
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సం బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఆర్థిక పరిస్థితి పెరుగుదల సమయంలోనే కరోనా దెబ్బతీసిందని, లక్ష కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోల్పోయిందని సీఎం అన్నట్లు తెలుస్తోంది. అయినా సంక్షేమ పథకాల కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నామని పేర్కొన్నారు. కరోనా తదనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగానే ఉంటుందని, ప్రగతి దాయకంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నీటిపారుదల, వ్యవసాయం, వైద్యం, విద్య తదితర రంగాలకు ప్రాధాన్యం యథాతథంగా కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు.













