ఈటల ఇంటికి వెళ్లి మరీ ప్రశంసించిన బీజేపీ అగ్రనేతలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరక మునుపే… ఆయనకు బీజేపీ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్‌తో సహా సీనియర్లందరూ ఈటల నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, బీజేపీ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, వివేక్ తదితరులు ఈటల నివాసానికి వెళ్లారు. ఈటలతో వీరందరూ 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్ మాట్లాడారు. తెలంగాణ బాగు కోసమే ఈటల రాజేందర్ పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. ‘‘ఉద్యమ కారుడు, సీనియర్ నేత అయిన ఈటలను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని తరుణ్ ఛుగ్ ప్రకటించారు. తెలంగాణ వికాసమే తమ పార్టీ లక్ష్యమని, మా సిద్ధాంతాలను మెచ్చి, మాతో కలిసి వచ్చే వారందర్నీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తమ ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తోందని తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆయన కుటుంబమే ఎక్కువ అయిందని, తెలంగాణ గౌరవాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆత్మ గౌరవానికి, అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగానే ఈటల తన స్వరాన్ని వినిపిస్తున్నారని తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు.