సవాళ్ల స్వాగతం..
తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి..ముళ్లబాట ఆహ్వానం పలుకుతోంది. రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి.. ముప్పేట ముసురుకున్న సవాళ్లకు ఎదురొడ్డి పార్టీని విజయతీరాల వైపు నడపాల్సి ఉంది. పూర్తి అగ్రెసివ్ గా పార్టీని నడిపి, గెలుపుపై కార్యకర్తల్లో భరోసా నింపిన బండి సంజయ్ వారసత్వాన్ని.. అంతే అగ్రెసివ్ గా కిషన్ రెడ్డి తీసుకెళ్లాల్సి ఉంది. ఓవైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, మరోవైపు నూతనోత్సాహంతో సమరశంఖం పూర్తిస్తున్న కాంగ్రెస్.. ఈరెండింటినీ తట్టుకుంటూ ముందుకు నడపాల్సి ఉంది.
పార్టీలో సమన్వయ లోపం, పదవులు దక్కని అసంతృప్తులు, పాత–కొత్త నేతల మధ్య భేదాభిప్రాయాలను సరిదిద్దడం ఓ వైపు.. అధికార బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొంటూ, విమర్శలను తిప్పికొడుతూ పార్టీని ముందుకు దూకించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది.రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన, సంఘ్ పరివార్ అండదండలున్న కిషన్‌రెడ్డికి తోడుగా.. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉన్న ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు పరిస్థితులను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంత తక్కువ సమయంలోనే పార్టీని చక్కదిద్ది, ఎన్నికలకు సిద్ధం చేయడం కత్తిమీద సామేనని బీజేపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అన్నింటికన్నా ముందు ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయడం కిషన్‌రెడ్డి ముందున్న ప్రథమ లక్ష్యమని అంటున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్న కిషన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నాయి.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గం, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల మార్పు వంటి సంస్థాగత చర్యలు కిషన్‌రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్ష మార్పు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం, పార్టీ మారకుండా చూడటంపైనా కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, రాష్ట్ర ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడం కూడా కీలకమని బీజేపీనేతలు చెబుతున్నారు.ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేననే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందంటున్నారు.నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఆలోగా వీటన్నింటినీ కిషన్ రెడ్డి…ఏ మేరకు చక్కదిద్దగలరనే చర్చ జరుగుతోంది.













