హై వోల్టేజ్ ఫైట్…
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది. పార్టీలు విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏచిన్న అవకాశం దొరికినా, ఇంచి కూడా వదలకుండా వాడేస్తున్నాయి. అంతేకాదు…ప్రత్యర్థి పొరపాటున నోరుజారితే సోషల్ మీడియా సైన్యంతో.. ఏకి పారేస్తున్నాయి. తర్వాత ఆ బురదను వదుల్చుకునేందుకు ప్రత్యర్థులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. మరోవైపు.. ఓటరు కూడా ఇప్పటికే తాము ఎవరికి ఓటు వేయాలన్నది డిసైడైనట్లు కనిపిస్తోంది. దీంతో ఓటరు నాడిని తమకు అనుకూలంగా మార్చేందుకు పార్టీలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలు చూస్తే.. ఇవి ఓ రాష్ట్ర ఎన్నికలా…? లేక దేశానికి సంబంధించినవా అన్న అనుమానం కలుగుతోంది. సాదారణంగా ఓరాష్ట్ర ఎన్నికలను .. ప్రధానమంత్రి రేంజ్లో ఉన్న వ్యక్తులు కామన్‌గా తీసుకుంటారు. కానీ ఈసారి అలా లేదు.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పెద్దలు.. క్యాంపెయినింగ్ మోత మోగిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ..ఈ ప్రచార భేరీని తనపైనే వేసుకున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మల, కిషన్ రెడ్డి తెగ తిరిగేస్తున్నారు. వీరుకాక..పొరుగు రాష్ట్రాల నుంచి సీఎంలు యోగీ, సోనోవాల్..తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అతిరథ మహారథుల రాకతో క్యాంపెయినింగ్ కలర్ఫుల్గా మారింది. మరోవైపు అధికారం ఖాయమన్న ఆశల్లో ఉన్న కాంగ్రెస్..తాము ఏమాత్రం తగ్గేది లేదని నిరూపిస్తోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. ఈ ఎన్నికల్లో ప్రచారపర్వాన్ని తామే దగ్గరుండీ మరీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్, బీఆర్ఎస్లపై మండిపడుతున్న నిరుద్యోగ యువత, మహిళలను టార్గెట్ చేశారు. వారి ఓట్లపై కన్నేశారు. ఇక కర్నాటక మోడల్, గ్యారంటీలపై ఆశలు పెంచిన కాంగ్రెస్..అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంల సేవలను వినియోగించుకుంటోంది. వారితో సరిహద్దు జిల్లాల్లో ప్రచార పర్వాన్ని సాగించింది.లేటెస్టుగా రాజస్థాన్ సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ను ప్రచార బరిలోకి దించింది. ఇక వీరుకాక.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం సభల్లో పాల్గొని వచ్చి వెళ్తున్నారు. దీనికి తోడు సామాజికవర్గాల వారీగా ఓట్లను రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నారు. తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. ప్రచారపర్వాన్ని దగ్గరుండీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు మరీ ముఖ్యంగా ధరణి, రైతుబంధు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయితే కాళేశ్వరం కాస్తా బూమరాంగ్ కావడంతో.. ఇప్పుడు ఎక్కడా ఆ పేరు వినిపించకుండా గులాబీదళం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.













