భారతీయులకు వీసాల జారీకి అధిక ప్రాధాన్యం : ఎలిజబెత్ జోన్స్
వీసాల జారీలో జరుగుతున్న జాప్యం రానున్న వేసవి నాటికి పరిష్కారమవుతుందని, భారతదేశంలోని అన్ని కాన్సులేట్లలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఛార్జ్ డిఅఫైర్స్ (యాక్టింగ్ అంబాసిడర్) ఎలిజబెత్ జోన్స్ తెలిపారు. హైదరాబాద్లోని కాన్సులేట్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ భారతీయులకు వీసాల జారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భారత్-అమెరికాల వాణిజ్యం గత దశాబ్ద కాలంలో 160 బిలియన్ డాలర్లను అధిగమించింది. ద్వైపాక్షిక సంబంధాలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయో, హైదరాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన కాన్సులేట్ భవనమే చెబుతోంది అని పేర్కొన్నారు.
అమెరికా వీసాలు పొందడంలో భారతీయులు ముందువరుసలో ఉన్నట్లు తెలిపారు. సుమారు ఇరవై లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుత విద్యాసీజన్లో దేశంలో 1.25 లక్షల మంది విద్యార్థులు వీసాలు పొందారు. సాధ్యమైనంత త్వరగా వీసాలు జారీ చేసే ప్రక్రియను చేపడతాం అన్నారు. ప్రస్తుతం బీ1/బీ2 వీసాలకు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. దానికి రానున్న రోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. హైదరాబాద్లోని నూతన కాన్సులేట్ భవన సముదాయం ప్రారంభానికి సంబంధించి భద్రతా అనుమతులు రావాల్సి ఉందన్నారు.













