ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు.. తెలుగు రాష్ట్రాల నేతలకు ఉచ్చు తప్పదా..?
ఢిల్లీ లిక్కర్ పాలసీలకు అవకతవకలకు పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే సీబీఐ వెంటనే రంగంలోకి దిగి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించింది. సీబీఐ సోదాల్లో ఏవైనా ఆధారాలు బయటపడ్డాయా లేదా అనేది తెలీదు. కానీ బీజేపీ మాత్రం మనీష్ సిసోడియా సూత్రధారిగానే ఈ స్కామ్ జరిగిందని చెప్తోంది. ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులకు కూడా అందులో పాత్ర ఉన్నట్టు ఆరోపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
కొంతకాలంగా మనీష్ సిసోడియా కేంద్రంగా ఈ స్కామ్ నడిచింది. సీబీఐ సిసోడియా మనీ లాంగరింగ్ కు పాల్పడ్డారంటూ సీబీఐ అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. సిసోడియాతో పాటు మరో 14 మందికి ఈ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, గుర్గావ్, నోడియా, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో కూడా ఈడీ ఈ దాడులు చేసింది. ఈడీ నమోదు చేసిన కేసుల్లో A-14గా ఉన్న రామచంద్రన్ పిళ్లై హైదరాబాద్ వాసి. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అంతేకాదు.. హైదరాబాద్ లోని అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్.. తదితరుల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు చేసింది. అయితే స్కామ్ సూత్రధారిగా చెప్తున్న మనీశ్ సిసోడియా నివాసంలో మాత్రం ఈడీ సోదాలు నిర్వహించలేదు.
హైదరాబాద్ లో ఈడీ సోదాలు నిర్వహించిన వారంతా రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారే. వీళ్లకు లిక్కర్ బిజినెస్ లతో సంబంధాలున్నాయి. దేశంలోను పలు రాష్ట్రాల్లో వీళ్లు మద్యం వ్యాపారం నిర్వహిస్తుంటారు. వీరిలో కొందరికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం. అందుకే బీజేపీ నేతలు ఈ స్కామ్ లో అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పైగా అధికార పార్టీ నేతల టార్గెట్ గా కేంద్ర సంస్థలను బరిలోకి దింపి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చని.. అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ కూడా ఎంతో కాలంగా మద్యం వ్యాపారంలో ఉన్నారు. ఆయన కూడా ఇందులో భాగస్వామి అని మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగింది. అంతేకాక సీబీఐ కానీ, ఈడీ కానీ ఆయన జోలికి వెళ్లలేదు. దీంతో ఆయన సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రద్దయినా.. దాని పర్యవసానాలు మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారాయి. ఇది ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో.. ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయంతో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం దీనిపై సీరియస్ గా ముందుకు వెళ్తే పలువురు ప్రముఖులను అరెస్ట్ చేసే స్థాయికి వెళ్లొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!













