అక్కడ రిజిస్టర్ మ్యారేజ్…ఇక్కడ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి
ప్రేమికుల దినోత్సవం రోజున ఏడడుగులు నడిచి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట చెందిన అబ్బాయి, నేపాల్ అమ్మాయి వివాహ వేడుక అక్కన్నపేట మండలం మసిరెడ్డితండాలో ఆత్మీయుల మధ్య జరిగింది. తండాకు చెందిన మాలోతు లక్ష్మి-బద్యి దంపతుల చిన్న కుమారుడు రమేశ్. ఎనిమిది ఏళ్ల క్రితం ఉన్న చదవుల కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరి అక్కడే స్థిరపడ్డారు. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో నేపాల్ అమ్మాయి (కుమారి)తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి ఆరు నెలల క్రితం అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా కుటుంబ సభ్యుల కోరిక మేరకు మసిరెడ్డి తండాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. చూడముచ్చటైన ఈ కొత్త జంటను చూసేందుకు తండావాసులు తరలివచ్చి ఆశీర్వదించారు.













