ఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ మళ్లీ గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణలో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు మనుగడ సాగించలేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ఎంతోమంది కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం పతనమవుతుందని ఎద్దేవా చేస్తూ వచ్చారు. దీన్ని సవాల్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపబోతున్నట్టు వార్తలందుతున్నాయి.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 8 నెలలు దాటింది. వందరోజుల్లోనే గ్యారంటీలు అమలు చేయాల్సి రావడంతో వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత రైతు రుణమాఫీ లాంటి స్కీములను అమలు చేసేందుకు దృష్టి సారించారు. ఆ వెంటనే అమెరికా, కొరియా పర్యటనలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ తెరవెనక్కు వెళ్లింది. అయితే ఇప్పుడు మేజర్ పనులన్నీ పూర్తి కావడంతో రాష్ట్రానికి తిరిగి రాగానే చేరికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. సెప్టెంబర్ లోపే చేరికలు ఉండొచ్చని.. ఆ తర్వాత బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునే ఆలోచన ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు చేరిపోయారు. అయితే చేరిన తర్వాత వీళ్లెవరికీ తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఎలాంటి పదవులూ లభించలేదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ లోకి రావాలనుకున్న కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీంతో ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే చేరికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తే బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునే వీలుంటుంది. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుని లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడవాలనుకుంటున్నట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పార్టీలో తగు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కీలకపదవులు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు చేరిక ప్రక్రియ పూర్తి కావచ్చనే సమాచారం అందుతోంది.