రాహుల్ పర్యటనతో తెలంగాణలో ఎన్నికల వేడి

తెలంగాణలో రాహుల్ పర్యటన ఎన్నికల వేడిని రగిల్చింది. ఎలాగైనా సరే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును అధికారం నుంచి తప్పించాలని కాంగ్రెస్ సిద్ధమైపోయింది. రాహుల్ గాంధీ పర్యటన కూడా ఈ విషయాన్నే తెలియజేసింది. తనకు దొరికిన అన్నీ అవకాశాలను కాంగ్రెస్ వదులుకోలేదు. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న మహిళలు, విద్యార్థులు, యువతను రాహుల్ తన పర్యటన ద్వారా స్వయంగా కలుసుకుని వారిని కాంగ్రెస్ వైపు ఆకర్షికులయ్యేలా చేశారు. రాహుల్ పర్యటన, సభకు వచ్చిన స్పందన చూసి అధికార టీఆర్‌ఎస్‌లో కూడా కదలిక వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రే రాహుల్ పర్యటనను చిన్నదిగా చేసేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ ఇచ్చినప్పటికీ కేసీఆర్ వ్యూహంతో చతికిలపడ్డ కాంగ్రెస్‌కు ఇటీవల రాహుల్ పర్యటన కొత్త జవసత్వాలను ఇచ్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ దానిని తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదు. ఇందుకు కాంగ్రెస్‌లోనే ఉన్న వర్గపోరు కూడా కారణమని చెప్పవచ్చు. మరోవైపు కేసీఆర్ కూడా తన వైఫల్యాలను ఎక్కువగా కనిపించకుండా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దృష్టిని పాలనవైఫల్యాలపై దృష్టి సారించకుండా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ఫార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హుషారును తెచ్చిపెట్టింది. సామాన్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు సంతోషాన్ని కలిగించింది. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న అంశాన్ని గుర్తించిన రాహుల్ తన పర్యటనలో పార్టీని స్తబ్దత నుంచి బయటపడేయడానికి శ్రద్ధ చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పర్యటన ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. మొదటి రోజు పర్యటనలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు. ఎన్నికల్లో స్వయం సహాయక సంఘాలు ప్రధాన పాత్రను పోషించే అవకాశముందన్న అంశాన్ని ఆయన గుర్తించడం వల్లే వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు కొత్త రుణాలు రాకపోగా, రుణమాఫీ కాదు, కనీసం దానిపై వడ్డీ కూడా మాఫీ కాలేదని రాహుల్ విమర్శించడం ఆకట్టుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధర, మహిళా సంఘాలకు రుణమాఫీతో పాటు రుణాలను కూడా ఇస్తామని చెప్పి వారిని కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. వడ్డీ లేని రుణాలతో పాటు సంఘాల బాధ్యులకు వేతనాలు ఇచ్చే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రస్తావించారు. పైగా తెలంగాణ మహిళలు సమర్ధవంతులని, వారు ఏ పనైనా చేయగలుతారని ఆయన కితాబిచ్చారు. తద్వారా తాము మహిళలకు ఎంత ప్రాధాన్యమిస్తామో చెప్పగలిగారు. రైతులు, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కర్ణాటకలో రుణమాఫీ చేసిన అంశాన్ని ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. రైతులకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టయింది. తాము ఆశించనట్టుగానే. రాహుల్‌గాంధీ పర్యటన సాగడంతో వచ్చే ఎన్నికల్లో తమకు లబ్ది కలుగుతుందని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
యువ సిఇఓలతో జరిగిన సమావేశంలో కూడా రాహుల్ వారిని ఆకట్టుకునేలా మాట్లాడారు. చిన్నతరహా పరిశ్రమల వారిని జిఎస్‌టి పరిధి నుంచి తప్పిస్తామని ఈ సమావేశంలో ఆయన హామి ఇచ్చారు. పెద్ద పరిశ్రమలనే కాకుండా మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. మోదీ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పారు. సిఇఓలు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ సమాధానమిచ్చారు. ఈ సీఇఓల సమావేశంలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జేసి దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌రెడ్డి, టీజి వెంకటేష్ కుమారుడు టీజి భరత్, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సంపాదకులతో జరిగిన సమావేశంలో కొన్ని విషయాలపై ఆయన నిర్మొహమాటంగా మాట్లాడటం విశేషం. వచ్చే ఎన్నికల్లో మోదీ ఓటమిపాలు కావడం ఖాయమని రాహుల్ ఈ సమావేశంలో సవాల్ విసరడం విశేషం. సంపాదకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు.
తన పర్యటనలో వ్యాపారుల, సంపాదకుల సమావేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆకర్షించాయి. దానికితోడు బహిరంగసభ కూడా విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తెచ్చింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎండగట్టారు. యుద్ధవిమానాల రీ డిజైనింగ్ పేరుతో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోచుకుంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ తన ప్రసంగంలో ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, టెండర్లు లేకుండానే పనులను కేటాయిస్తూ కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. ఇలా పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో డబ్బులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నీ వర్గాల ప్రజలు మోసపోయారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై రాహుల్ చేసిన విమర్శలకు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది.
ఉత్తమ్ కృషి…
రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ వర్గాలైతే టీఆర్‌ఎస్ పట్ల గుర్రుగా ఉన్నాయో గుర్తించిన ఉత్తమ్ ఆ వర్గాలను కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయగలిగారు. మహిళలు, స్వయం సహాయక బందాలు, విద్యార్థులు, నిరుద్యోగులకు రాహుల్‌గాంధీతో స్వయంగా హామీలు ఇప్పించడం ద్వారా వారికి పార్టీ పట్ల భరోసా కల్పించగలిగారు.
జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు తర్వాత యువ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించడం ద్వారా వ్యాపార వర్గంలో పార్టీ పట్ల సానుభూతి తెప్పించగలిగారు.
మరోవైపు రాహుల్ పార్టీలో వర్గ విభేదాలను పక్కన పెట్టాలని నాయకులను సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అందరూ సమష్టిగా ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన సూచించారని, ముఠా తగాదాలను పక్కనపెట్టాలని కోరినట్లు సమాచారం. టిక్కెట్లకోసం ఢిల్లీకిరావక్కరలేదని, తానే స్వయంగా సర్వే చేయిస్తున్నానని దానికి తగినట్లుగా అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు టిక్కెట్ల విషయమై రాహుల్‌ను అభ్యర్థించలేకపోయారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి లాంటి వారికి మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను రాహుల్ గుర్తించారని, అందుకు తగ్గట్టుగా నాయకత్వ మార్పులు కూడా ఉండవచ్చని అంటున్నారు.
– గోవింద్