పొంగులేటి, జూపల్లి చేరికకు ముహూర్తం ఖరారు..!! పార్టీ కూడా ఇదే..!!
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా బాగా వినిపిస్తున్న పేర్లు పొంగులేటి, జూపల్లి. వీళ్లిద్దరూ ఏ పార్టీలో చేరతారనేదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. వీళ్ల చేరికలపై బెట్టింగులు కూడా నడుస్తున్నాయంటే ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఉత్కంఠకు ఇప్పుడు బ్రేక్ పడబోతోంది. వాళ్లు చేరే పార్టీ, తేదీ దాదాపు ఖరారయ్యాయి. నేడో రేపో ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తీసుకుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు పొంగులేటి, జూపల్లి చేరిక భారీ పరిణామాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. వైసీపీ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లిన ఈ మాజీ ఎంపీ.. ఆ తర్వాత అక్కడ ప్రాధాన్యత లేకపోవడంతో దూరమయ్యారు. ఇంకరకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఆయన్ను బహిష్కరించింది. జిల్లా మొత్తాన్ని శాసించగల స్థాయిలో ఉన్న పొంగులేటి.. ఇప్పుడు మరోసారి సత్తా చాటాలనుకుంటున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కనీయకూడదనే పట్టుదలతో ఉన్నారు పొంగులేటి. అందుకే పొంగులేటిని తమ పార్టీల్లో చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించాయి. అయితే పొంగులేటి రెండు పార్టీలతో చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లిన జూపల్లికి కూడా అక్కడ పరాభవమే ఎదురైంది. దీంతో పార్టీకి దూరమయ్యారు. చివరకు బీఆర్ఎస్ కూడా ఆయన్ను బహిష్కరించింది. దీంతో ఆయన కూడా పొంగులేటి లాగే బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దీంతో జూపల్లికోసం కాంగ్రెస్, బీజేపీ గట్టిగానే ప్రయత్నించాయి. పొంగులేటిది, తనది ఒకే బాపతు కావడంతో ఇద్దరూ కలిసి రెండు పార్టీలతో బేరసారాలాడారు. కేసీఆర్ ను ఓడించాలంటే ఏం చేస్తారనే ప్రశ్న రెండు పార్టీలకూ వేశారు. దీనికి బీజేపీ నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. పైగా బీఆర్ఎస్ తో బీజేపీ మిలాఖత్ అయిందనే అనుమానాలు వీళ్లకున్నాయి.
దీంతో ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వీళ్ల చేరికకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు జిల్లాల్లో వీళ్లు చెప్పిన వాళ్లకు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలో వీళ్లిద్దరు చేరనున్నారు. ఈ నెల 20 లేదా 25న ఈ సభ ఉండే అవకాశం ఉంది. దీంతో ఉత్కంఠకు బ్రేకి పడినట్లయింది.













