షర్మిల సభకు ఓకే..! కానీ కండిషన్స్ అప్లై…!!
తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన షర్మిల అందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె.. త్వరలోనే పార్టీ ప్రకటన చేయబోతోంది. ఇందుకోసం అమె ఖమ్మంను వేదికగా నిర్ణయించింది. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించాలని నిర్ణయించింది.
ఖమ్మంలో ఏప్రిల్ 9న సభ నిర్వహించుకునేందుకు పర్మిషన్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు షర్మిల అభిమానులు. షర్మిల అనుచరుల వినతిని పరిశీలించిన పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ సభ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఐదారు వేలమందికి మించి సభకు హాజరు కాకుండా చూసుకోవాలని షరతు విధించారు. అంతేకాదు.. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతికదూరం లాంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హెచ్చరించారు.
వాస్తవానికి లక్ష మందితో సభ ఏర్పాటు చేయాలనేది షర్మిల ప్లాన్. లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఇప్పటికే ఆమె వై.ఎస్. అభిమానులకు సూచించారు. అనుచరుడు రాఘవరెడ్డి ఇప్పటికే ఖమ్మంలో పర్యటించి ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. భారీ సభ ద్వారా తమ సత్తా ఏంటో తెలంగాణ పార్టీలకు చూపించాలనుకున్నారు. కానీ పోలీసుల షరతులతో షర్మిల అభిమానులు ఖంగుతిన్నారు.
పోలీసుల కండిషన్స్తో ఖంగుతిన్న షర్మిల.. సభ కంటిన్యూ చేస్తారా.. లేకుంటా వాయిదా వేసుకుంటారా.. అనే సందిగ్ధత నెలకొంది. కేవలం ఐదారు వేల మందితో సభ నిర్వహించడం కన్నా.. మిన్నకుండం మేలనే సూచనలు కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో షర్మిల ఏం చేస్తారు.. అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.













