వారికి మానుకోట దమ్మేంటో చూపించాలి : హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరుగెత్తారని, మళ్లీ వారంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారన్నారు. వారికి మానుకోట దమ్మేంటో చూపించాలని కోరారు. శంకర్ నాయక్ నోరు కఠినమైనా సిద్దిపేట కంటే బాగా అభివృద్ధి చేశారన్నారు. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ వచ్చేవా? అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని విమర్శించారు.
రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసిందని, కేసీఆర్ చేసిన కృషి వల్లే రైతు బంధు డబ్బులు సోమవారం రైతుల ఖాతాల్లో పడతాయన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటి వరకు 90 శాతం హామీలు నెరవేర్చామని, రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ దఫా ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు. మూడోసారి గెలిస్తే అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు ద్వారా 11 విడతల్లో రూ.73వేల కోట్లు ఇచ్చాం. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే పేదలందరికీ ఇళ్లు కటిస్తాం. మోటార్లు పెట్టలేదని కేంద్రం రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. రైతులందరికీ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేశారు. 403 సీట్లు ఉన్న యూపీలో ఆమె ప్రచారం చేస్తే 2 సీట్లు మాత్రమే వచ్చాయి అని ఎద్దేవా చేశారు.













